
—హుజురాబాద్ డివిజన్ పరిధిలో 21 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
—కమిషనరేట్ వ్యాప్తంగా మరో 700 కెమెరాల ఏర్పాటు లక్ష్యం
—యువత డ్రగ్స్, సైబర్ గేమింగ్ అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలి
—రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే ‘రహవీర్’ పథకం ద్వారా రూ.25 వేల బహుమతి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్/జమ్మికుంట: శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం పేర్కొన్నారు.
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని సైదాబాద్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను, కొరపల్లి గ్రామంలోని 05 సీసీ కెమెరాలను ఆయన గురువారం ప్రారంభించారు.


అనంతరం జమ్మికుంట పట్టణ మరియు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు సీపీ జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జమ్మికుంటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రజలతో ఏర్పాటు చేసిన విస్తృత అవగాహన సదస్సులో సీపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..
—సీసీటీవీల విస్తరణ: ప్రతి గ్రామం, పట్టణం మరియు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

—సైబర్ నేరాలు – ఆన్లైన్ గేమింగ్ ముప్పు: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్లైన్ గేమింగ్ (Gaming Addictions) బారిన పడి డబ్బులు నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలి.

—మత్తు పదార్థాల నిర్మూలన: యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా ‘డయల్ 100’ కు సమాచారం అందించాలి. యువత మత్తుకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలి.
—రోడ్డు భద్రత – రహవీర్ పథకం: వాహనదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం ‘రహవీర్ పథకం’ కింద రూ. 25,000 నగదు పురస్కారం అందిస్తుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సైదాబాద్ సర్పంచ్ రాజారామ్, కొరపల్లి సర్పంచ్ మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు సీపీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతిలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.





