
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మామిండ్లవాడ జూనియర్ కళాశాల మైదానం పక్కన గల ఒక ఇంటిలో ఉన్న బావిలో అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం….మామిండ్లవాడకు చెందిన ముత్తొజు భాగ్య శనివారం ఉదయం తన ఇంటి ఆవరణలో ఉన్న చేద బావిలో నీటిని తోడేందుకు బకెట్ వేయగా ఒక మనిషిని పోలి వున్న శవం కనిపించింది. ఈ విషయాన్ని స్థానిక 15వ వార్డు కౌన్సిలర్ భర్త బండ నవీన్ కు తెలపడంతో ఆయన పోలీసులకు తెలిపారు. బావి నుండి మృతదేహాన్ని ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి బయటకు తీయగా మృతురాలు చింత సునీతగా గుర్తించారు. మృతురాలు కేవలం కుర్తా ధరించిందని, మెడకు నలుపు రంగు చీర గుడ్డతో ఉరి వేసినట్లుగా ఉంది. ముఖంపై పెదాలపై గాయాలు ఉన్నాయి. సునీత మొదటి భర్త చనిపోగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి రంగాపూర్ కు చెందిన మోతే కిరణ్ అనే వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తుంది. కిరణ్ తో సునీత ఎప్పుడు గొడవ పడుతుండేవారనీ, ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి సందర్శించి పరిశీలించారు.


మృతదేహాన్ని పరిశీలిస్తున్న టౌన్ సిఐ కరుణాకర్, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది..
ఈ సందర్భంగా హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ మాట్లాడుతూ…మృతురాలు హత్య చేయబడిందా లేదా అన్న కోణంలో పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. డాగ్ స్క్వాడ్ తో సంఘటన స్థలాన్ని పరిశీలింప చేసినట్లు ఆయన తెలిపారు. కాగా మోతే కిరణ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మహిళ హత్య జరిగిందని పట్టణంలో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కావడంతో సంచలనం కలిగించింది. అయితే మృతురాలి పెద్ద కూతురు(మైనర్ బాలిక) పై గత కొన్ని రోజుల క్రితం అత్యాచారయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి ఈ హత్యకు దారి తీసిందా లేదా సునీత కిరణ్ తో పాటు ఇతరులతో సహజీవనం కొనసాగిస్తే విభేదాలు వచ్చి హత్యకు దారి తీసిందా? పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది.





