Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….దళితులు ఆర్థికంగా స్వావలంబన సాధించి సమాజంలో గౌరవంగా జీవించాలనే మహోన్నత లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన గొప్ప సంక్షేమ పథకం దళిత బంధు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేలాది దళిత కుటుంబాలు ఈ పథకం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని స్వయం ఉపాధి అవకాశాలు పొందాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు రెండో విడతను పూర్తిగా నిలిపివేసి, అర్హులైన వేలాది మంది లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు.. వెంటనే దళిత బంధు రెండో విడతను విడుదల చేసి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని కన్నెపల్లి పంపుల ద్వారా అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్ మానేరు ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందించాలి అని కోరారు. ఇసుక క్యారీల రాకపోకల కారణంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట కమలాపూర్ మండలలో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారాయని, దీంతో ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే ఆయా మండలాల రహదారులను మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇతర అభివృద్ధి, ప్రజా సమస్యలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తూ వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో జల కుమారి, నాయకులు బండ శ్రీనివాస్, ముసిపట్ల తిరుపతిరెడ్డి, పాల్నేని సత్యనారాయణరావు, తదితరులు ఉన్నారు.
#లోకల్ యాడ్స్#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





