
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలో అధికారం చేతిలో ఉన్నా.. సొంత పార్టీ దివంగత ప్రధాని విగ్రహానికి రంగులు వేయించే తీరికలేని స్థానిక కాంగ్రెస్ నాయకుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం హుజూరాబాద్ పట్టణంలోని బస్ డిపో కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు పోటీపడ్డారు. అయితే, ఎండ, వానలకు తడిసి ఏళ్లుగా రంగులు వెలిసిపోయి కళావిహీనంగా మారిన ఆ విగ్రహాన్ని కనీసం పట్టించుకోకుండా, జయంతి రోజూ అలాగే వదిలేయడంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

–అధికారంలో ఉన్నా పట్టని వైనం!
హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వొడితల ప్రణవ్, హుజురాబాద్ లో కీలక నేతలు అధికార పగ్గాలు చేపట్టి ఉన్నారు. మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ చేతిలోనే ఉన్నప్పటికీ, పట్టణ నడిబొడ్డున నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి, రంగులు వేయించాలన్న కనీస బాధ్యతను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫొటోలకే హడావిడి.. నిర్వహణ గాలికే!
కళావిహీనంగా మారిన విగ్రహానికే హడావిడిగా పూలదండలు వేసి ఫొటోలకు ఫోజులివ్వడంపై స్థానికులతో పాటు సొంత పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘సొంత పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని విగ్రహ నిర్వహణే చేతకానప్పుడు.. ఇక పట్టణ సమస్యలను ఏం పరిష్కరిస్తారు?’ అంటూ ప్రజలు నేరుగానే పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక పాలకవర్గం స్పందించి, పట్టణంలోని విగ్రహాల సుందరీకరణపై దృష్టి సారించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.





