Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వానాకాలం–2026లో ప్రభుత్వం గుర్తించిన 7 సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులు సన్న వడ్ల బోనస్ పొందేందుకు తమ సాగు వివరాలను తప్పనిసరిగా ముందుగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చందా భూమిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…

రైతులు ఫర్టిలైజర్ డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే, సంబంధిత డీలర్లు విత్తన విక్రయ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని అన్నారు. రైతులు తమ స్వంత వడ్లను విత్తనాలుగా ఉపయోగించినట్లయితే, రైతు స్వీయ ధ్రువీకరణ పత్రమును వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించి, ఆన్లైన్లో సాగు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సీడ్ ప్లాంట్లు లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు, విత్తనాల కొనుగోలు రసీదు జిరాక్స్ ప్రతిని రైతు ధ్రువీకరణ పత్రముకు జత చేసి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఆన్లైన్లో సాగు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. సాగు వివరాల నమోదుకు చివరి తేదీ 10 సెప్టెంబర్ 2026 అని అన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతుల తుది జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీలలో ప్రదర్శించడం జరుగుతుందని, ఆన్లైన్లో సాగు వివరాలను నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సన్న వడ్లకు క్వింటాల్‌కు ₹500/- బోనస్ పొందేందుకు అర్హత ఉంటుందని అన్నారు. రైతులు ఎటువంటి ఆలస్యం చేయకుండా 10 సెప్టెంబర్ 2026లోగా తమ సాగు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.





