
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 563పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో బిజెపి నాయకురాలు కొంకటి సులోచన (44) అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే… చెల్పూర్ గ్రామానికి చెందిన కొంకటి రమేష్ – సులోచనలు తమ ద్విచక్ర వాహనంపై పెద్దపాపయ్యపల్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో వెనుక నుండి అతివేగంగా వచ్చిన డిసిఎం వ్యాన్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సులోచన ఎగిరి రోడ్డుపై పడడంతో తల పగిలి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రుడిని హుటాహుటిన వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన సులోచన గత ఎనిమిది నెలల క్రితం చెల్పూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆమె భర్త రమేష్ ప్రస్తుతం బిజెపి ఎస్సీ సెల్ మండల నాయకుడిగా కొనసాగుతున్నారు. పండుగ పూట కుటుంబంలో ఊహించని ఈ విషాదం జరగడంతో చెల్పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సులోచన మృతి పట్ల చెల్పూర్ గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి రఘు, మాజీ సర్పంచులు ఉదయమర్రి కృష్ణమూర్తిశర్మ, చిన్నక్క విజయలలీత, పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నేరెళ్ల మహేందర్ గౌడ్, బిజెపి నేత మండల సాయిబాబా, బిఆర్ఎస్ నాయకుడు పంజాల సదానందంగౌడ్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.







