
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు, బహుజన ఉద్యమ నిర్మాత మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ చైతన్యం అందించి రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా కాన్షీరాం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. బహుజనుల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, కాన్షీరాం ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు, జూపాక ఉప సర్పంచ్ గిన్నారపు మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్, పార్లమెంట్ ఇంచార్జీలు అక్కి బాలకిషన్, దొడ్డే శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





