Oplus_16777216
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్ (కరీంనగర్ జిల్లా), నవంబర్ 22:
హుజురాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి రెండు ఇళ్లలో చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శనగర్లో నివాసముంటున్న పిన్రెడ్డి దేవిక, తీగల చైతన్య నివాసాలలో శనివారం (21.11.2026) రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. పిన్రెడ్డి దేవిక ఇంట్లో నుంచి 64 గ్రాముల బంగారం, 25 తులాల వెండి వస్తువులను దొంగలు అపహరించారు. అలాగే తీగల చైతన్య ఇంట్లో బీరువా పగలగొట్టి రూ.1,50,000 నగదు, 37 గ్రాముల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
రెండు ఇళ్లలో కలిపి మొత్తం 101 గ్రాముల బంగారం, 41 తులాల వెండి వస్తువులు మరియు రూ.1.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కాలనీలో రెండు ఇళ్లలో చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.




