
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: తెలంగాణలో అతి కొద్ది సమయంలోనే ఉప ఎన్నికలు రాక తప్పదని అందులో పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఓటమి పాలవడం ఖాయమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదులోని బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి తనతో పాటు వివేక్ హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా హైకోర్టులో అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ గా మిగిలిపోయింది అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపికి ఓటు వేస్తే 48 గంటల్లోపే కాంగ్రెస్ పార్టీ వారిపై అనార్హత వేటు వేసిందని అన్నారు. అనహర్హత వేటు వేసిన ఆ ఎమ్మెల్యేలకు పెన్షన్ కూడా ఇవ్వద్దని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నప్పుడు డబుల్ స్టాండర్డ్ గా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్ లో అనర్హత వేటు వేస్తారని, కర్ణాటకలో కాపాడుకుంటారని, తెలంగాణలో మాత్రం ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి పార్టీలో చేర్చుకుంటారని ఎద్దేవా చేశారు. ఈరోజు భారతదేశ మొత్తం రాహుల్ గాంధీని చూస్తుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాగో క్యారెక్టర్ లేదని ప్రజలకు తెలిసిపోయిందని, రాహుల్ గాంధీ రేపు ఏం చేస్తారు అనేది దేశం మొత్తం ఎదురు చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడికి పోయినా రాజ్యాంగం వెంటబెట్టుకొని వెళ్తున్నారని, డిపెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని వారి మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా పార్టీ మారితే వారిపై అనర్హత వేటు తీసుకొస్తామని ఆ మేనిఫెస్టోలోని 22వ పేజీలో స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నానన్నారు. పార్టీ మారిన వారిపై తీసుకునే చర్యలపై రాహుల్ గాంధీ నిర్ణయం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుందని అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉన్నప్పుడు దేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పాలసీ ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. మూడు రాష్ట్రాల్లో మూడు విధానాలతో ఉండే పార్టీని జాతీయ పార్టీ అనడం కంటే సబ్ రీజియన్ పార్టీ అనడం సరైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపాదించిన అవినీతి సొమ్ముతో పదిమంది ఎమ్మెల్యేలను 1000 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ రోడ్లమీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిరగనివ్వనని చెప్పిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ను నెలరోజుల తర్వాత అదే రోడ్లమీద ఉరికించడం ఖాయమని అన్నారు. స్పీకర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, స్పీకర్ తీసుకునే నిర్ణయంతోనే వారికి న్యాయస్థానాల మీద ఎంతవరకు గౌరవం ఉంటుందో తెలిసిపోతుందన్నారు. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటాగా స్వీకరించి న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు. ఉప ఎన్నికల సమయం ఎంత దూరంలో లేదని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని, అద్భుతమైన నిర్ణయం తీసుకున్న న్యాయస్థానానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకనంద తదితరులు పాల్గొన్నారు.







