
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్,అక్టోబర్ 15: జర్నలిస్టు యూసుఫ్ పై చందుర్తి పోలీసులు అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టడం అన్యాయమని, అతనిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మెర తిరుపతిరెడ్డి, బాపురావు, మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్ తదితరులు కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న జర్నలిస్టు యూసుఫ్ ను కలిసారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన విషయాలను జర్నలిస్టు యూసుఫ్ ను అడిగి తెలుసుకున్నారు. ఇతరుల కేసులో తనను ఇరికించారని, తాను ఏ తప్పు చేయలేదని, పోలీసులు కావాలని తనపై తప్పుడు కేసు పెట్టారని జర్నలిస్టు యూసుఫ్ చెప్పారు. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీసులు ఇటీవల తమ ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, సిరిసిల్ల జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడైన ఎండి యూసుఫ్ కు సంబంధంలేని ఒక కేసును అంటగట్టి అతనిపై అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. యూసుఫ్ పై పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరింపజేసి, అతనిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తప్పు చేయని జర్నలిస్టులపై ఇలా తప్పుడు కేసులు పెట్టడం తగదని, ఈ సంఘటనపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించి జర్నలిస్టు యూసుఫ్ పై తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపై అక్రమ కేసులు ఉండవని భావించామని, కానీ అక్రమ కేసుల బనాయింపులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు యూసుఫ్ పై చందుర్తి పోలీసులు అక్రమ కేసు పెట్టడం సహించరానిదని అన్నారు. యూసుఫ్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని,అతనిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.






