
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో “పరిశోధకులు పరిశోధన అంశమును ఎంచుకొనుట, నాణ్యమైన వ్యాసములు వ్రాయుట” అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ ఈసీఈ విభాగం ప్రొఫెసర్ వి.రాజగోపాల్అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. పరిశోధకుడు తమ పరిశోధనలు మొదలుపెట్టినప్పుడు ఆ అంశంలో ఇంతకు ముందు జరిగిన పరిశోధనలను కూలంకషంగా తెలుసుకోవాలని, ఇంతకుముందు పరిశోధకులు చేసిన ప్రయోగాలను ఫలితాలను విశ్లేషించాలని అన్నారు. ఒక పరిశోధన అనేది నిరంతర కార్యక్రమమని పరిశోధనకు ఇంతకుముందు రాసిన వ్యాసాలను చదవడం వాటినుండి ముఖ్య అంశాలను నేర్చుకోవడం, ఈ అంశాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఈ అంశము మీద ఇంకా ఏదైనా పరిశోధన మిగిలి ఉన్నదా అనే అంశాన్ని కనుక్కుంటే ఒక అభ్యర్థి యొక్క పరిశోధన పూర్తి అయినట్టేనని రాజగోపాల్ అన్నారు. ప్రయోగాలు చేసేటప్పుడు ప్రమాణాలను పాటించాలని ఉత్తమ పరిశోధనా కేంద్రాల వద్దనే ప్రయోగాలు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కందుకూరి శంకర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డీన్, ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ కే. ప్రవీణ్ కుమార్ రావు, ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డీన్ , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎం.వి సతీష్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్చార్జి డాక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు






