
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హిందువులు మార్గశిర మాసంలో పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలకు సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలన్నీటిని అందంగా అలంకరించారు. హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సీతరామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణ కార్యక్రమం చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. హుజురాబాద్ పట్టణ శివారులోని కేసీ క్యాంపులో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉత్తర ద్వారము ద్వారా దర్శనం భక్తులకు కల్పించారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుప్పావై పాటించారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. పల్లకి మోయడానికి భక్తులు పోటీలు పడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ దంపతులు కొలిపాక నిర్మల శ్రీనివాస్ దంపతులు, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దర్శనాలు గావించారు. ఈ వేడుకలు వేద పండితులు శ్రీధర్ ఆచార్యులు నందకిషోర్ ఆచార్యులు, రామాచార్యులు, సుజితాచార్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.








కేసి క్యాంపులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు..













