
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ టియు డబ్ల్యూ జే (ఐ.జె.యూ) హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, పట్టణంలో ర్యాలీ నిర్వహించి తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ తాహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దశలవారీగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో -కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణలు మాట్లాడుతూ…గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తూ గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొందినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని అనుకున్నప్పటికీ తమకు నిరాశే ఎదురైందన్నారు. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని వారు పేర్కొన్నారు. నివేషన స్థలాలు విషయంలో ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులు మనో వేదనతో చనిపోయారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కేటాయించిన స్థలాల్లోనే ఇందిరమ్మ గృహ పథకం కింద పూర్తిస్థాయిలో ఇళ్ళు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇళ్ల సమస్యలను పరిష్కరించే వరకు దశలవారీగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అధికారులు తమ గృహాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్, బొడ్డు శ్రీనివాస్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు మామిడి రవీందర్, తిరునగరి ఆంజనేయస్వామి, మండల యాదగిరి, అల్లి నరేందర్, సురుకంటి తిరుపతిరెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








