
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, 15 ఏప్రిల్: కరీంనగర్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధతో చదివి నూరు శాతం ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకాంక్షించారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా, ఉపాధి అవకాశాలకైనా విద్యార్హతలు ముఖ్యమని అన్నారు. అందుకే జిల్లా యంత్రాంగం తరపున గత తొమ్మిది సంవత్సరాలుగా 10వ తరగతిలో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులను గుర్తించి గత ఏడాది పదవ తరగతి పరీక్ష రాయించిన విషయాన్ని గుర్తు చేశారు. వీరిలో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువుల్లో చేరారని అన్నారు. అనారోగ్యం, వివాహం, కుటుంబ పరిస్థితులు వంటి వివిధ కారణాల చేత చాలామంది పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసిన వాళ్ళు ఉన్నారని, వారంతా ఓపెన్ స్కూల్లో చేరాలని సూచించారు. ఓపెన్ స్కూల్ విద్యార్హత రెగ్యులర్ అర్హతకు సమానమేనని అన్నారు. దూర విద్య ద్వారా ఉన్నత విద్య అభ్యసించి అనేకమంది ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారని తెలిపారు. ఈనెల 20 నుండి నిర్వహించనున్న ఇంటర్, పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులంతా తప్పక హాజరై పరీక్ష రాయాలని సూచించారు. పాస్ అయిన తర్వాత దూరవిద్యలో డిగ్రీలో చేరాలని సూచించారు. ఓపెన్ స్కూల్ తరగతులు గ్రంథాలయాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని విద్యాధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు మాట్లాడుతూ పదవ తరగతికి 421 మంది, ఇంటర్ కి 881 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. చదువు మధ్యలో ఆపిన వాళ్ళు రానున్న విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ లో చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సిహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

