
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా వీర జవాన్లకు వందనాలు తెలుపుతూ, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన అన్ని రక్షణ వ్యవస్థలను అభినందిస్తూ దేశ వ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున సాయంత్రం భారీ తిరంగా ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఉగ్ర మూకుల దాడిని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించిందని తెలిపారు. ఉగ్రవాదుల చర్యలతో భారతీయుల రక్తం మరిగిపోయిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్ర మూకల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని, అందులో భాగంగా దేశ త్రివిధ దళాలకు, సైన్యానికి పూర్తి స్వేచ్చనిచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తో ఇండియన్ ఆర్మీ తమ సత్తా చాటి, దేశశక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. టెర్రరిస్ట్ స్థావరాలను పూర్తిస్థాయిలో భారత సైన్యం మట్టు పెట్టిందని , వందమంది ఉగ్రవాదులను, ఉగ్ర ముఖ్య నేతలను ఇండియన్ ఆర్మీ హత మార్చిందని పేర్కొన్నారు. దీంతో దాయాది దేశం, ఉగ్రముకలు తోక ముడిచాయని, మూడు రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చాయన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశం విశ్వగురు స్థాయికి ఎదిగిందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ధైర్యం భారతదేశానికి ఉందనే విషయం ప్రపంచానికి మొత్తం అర్థమైందన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం చేపట్టిన చర్యలకు దేశ ప్రజలు పూర్తిస్థాయి మద్దతు తెలిపారని,
26 నిమిషాల్లో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఘనత భారత సైన్యానికి దక్కుతుందన్నారు.పాకిస్థాన్ తుప్పు పట్టిన చైనా ఆయుధాలు, పనికిరాని టర్కీ డ్రోన్లతోఅల్లకల్లోలం సృష్టించాలనుకుందనీ, అయితే భారత సైన్యం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలతో అద్భుతమైన విజయం సాధించిందని తెలిపారు. చివరికి పాకిస్థాన్ అమెరికా ద్వారా శరణు వేడేలా భారత ప్రధానమంత్రితో బ్రతిమిలాడుకునే స్థాయికి దిగజారిందన్నారు. భారత సైనికులు స్వదేశీ పరిజ్నానంతో తయారు చేసుకున్న క్షిపణి వ్యవస్థ, ఆయుధాలతో పాకిస్థాన్ కు నిద్రలేని కాలరాత్రులు గడిపేలా చేశారని, రానున్న కాలంలో పాకిస్థాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు, దురాగతాలకు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత ప్రధాని ధీటుగా బదులిచ్చారన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పోరాడి అమరులైన వీర జవాన్లకు, వీరోచిత పోరాటం చేస్తున్న భారత సైనికులకు వందనాలు తెలియజేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల, అసెంబ్లీ కేంద్రాల్లో తిరంగా యాత్ర కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. ప్రజలందరూ తిరంగా యాత్రలో పాల్గొని, భారత సైనికులకు వందనాలు తెలియజేయాలని, మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, ఉగ్రవాద నిర్మూలనకు సంకల్పబద్ధంగా శపథం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం నిర్మలారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు మండల అధ్యక్షులు రాజు ర్యాకం శ్రీనివాస్ నరేష్ కొండల్ రెడ్డి రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మాజీ మండల అధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.



