
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా గాయపడుతున్నది యువతే అని, కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రమాదాలు తగ్గుదల అవుతాయని జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ ల సౌజన్యంతో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు మన అందరి ఆస్తి అని అన్నారు. రోడ్డు మీద పలు రకాల వాహనాలతో పాటు పాదచారులు కూడా నడుస్తారని చెప్పారు. వాహనాలను నడుపు వారు పాదచారులను గుర్తించి వారు సురక్షితముగా రోడ్డు దాటేందుకు సహకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయ పడినప్పుడు కాళ్లు చేతులకు దెబ్బలు తాకినచో వాటిని సులభముగా నయం చేయవచ్చన్నారు. కానీ తలభాగమునకు దెబ్బ తాకినచో ప్రాణాపాయ స్థితికి వస్తారన్నారు. హెల్మెట్ ధరించుట వలన తలను రక్షించుకోవచ్చన్నారు. కారు, జీపులను నడిపేవారు సీటు బెల్టులను తప్పనిసరిగా ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారిలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ అని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ…విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహనను కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లుగా పనిచేసిన ఎన్సిసి క్యాడెట్లకు సీపీ ప్రశంసా పత్రాలను అందజేశారు. సైదాపూర్, శంకరపట్నం మండలాలకు చెందిన పలువురికి లర్నింగ్ లైసెన్సులను అందించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి, హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు, సిఐలు టి కరుణాకర్, పులి వెంకట్, లక్ష్మీనారాయణ, ఎస్సైలు స్వాతి, శేఖర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపి గౌస్ అలం

రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేస్తున్న సిపి గౌస్ ఆలం, ఏసిపి మాధవి, కిట్స్ ప్రిన్సిపల్ శంకర్ తదితర పోలీసు అధికారులు..

కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయిస్తున్న సిపి గౌస్ ఆలం





