
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన, తీవ్ర గాలి దుమారానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్ట పోయారని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు ప్రజాసంఘాల నాయకులతో కలిసి మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతులను కలిసి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై ఆరపెట్టిన ధాన్యన్ని పరిశీలించారు. గాలి దుమారానికి రాలిపోయిన మామిడి తోటలను సందర్శించి రైతులను ఓదార్చి పంటల నష్టం వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన ఇళ్ల బాధితులతో రామారావు మాట్లాడారు. ఈసందర్భంగా పోలడి రామారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట గాలి దుమారానికి నేల కొరిగి తీవ్ర నష్టాన్ని కలిగించిందని, కళ్ళాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయి పోయిందని, మామిడి కాయలు రాలి పోయి అన్నదాతల ఆక్రందనలతో తీవ్రంగా మనోవేదనకు గురి చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వ్యవసాయాధికారును, రెవెన్యూ అధికారులను క్షేత్ర స్థాయికి దింపి పంట నష్టం వివరాలను సేకరించి గ్రామాన్ని యూనిట్ గా పరిగణించి 48 గంటల్లో నష్టపోయిన రైతులకు నష్టరిహారం అందించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఇల్లు నష్టపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తక్షణం పునరుద్ధరించి విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.
నిబంధనలను పక్కన పెట్టి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వలె ఉదారంగా బాధితులకు తక్షణ సహాయం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు. వడగాల్పులతో అస్వస్థతకు గురవుతున్న వృద్దులకు సంచార వైద్యం అందించి సహాయ పడాలన్నారు. ఉపాధి హామీ నిబంధనలు సడలించి ఉపాధి కూలీలతో ప్రదాన రహదారుల వెంట నేలకొరిగిన చెట్లను తొలగించుటకు జంగిలి క్లియరెన్స్ పనులు చేపట్టాలన్నారు.
గ్రామాల్లో పేరుకుపోయిన డ్రైన్లలో పూడిక తీత పనులు చేపట్టి రహదారుల వెంట చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని, హరితహారంలో చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు మండల స్థాయిలో పర్యవేక్షించే నోడల్ అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలన్నారు. గ్రామాల్లో ఉపాధి పనిదినాలు తగ్గకుండా, ఇంకా మరిన్ని పని దినాలు కల్పించి నిరుద్యోగులకు పని కల్పించాలన్నారు.
