
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత 15 సంవత్సరాలుగా హుజురాబాద్ పట్టణంలోని చెరువులు కుంటలు వాగులు కట్టు కాలువలు కబ్జాలకు గురవుతున్నాయని సంబంధిత అధికారులకు ఎప్పుడు పిర్యాదు చేసిన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని, హుజురాబాద్ లో జరుగుతున్న కబ్జాలపై తెలిసి కూడా వాటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నా అధికారులపై త్వరలోనే హైదరాబాద్ లోని సియంఓ ఆఫీస్ లో పిర్యాదులు చేస్తానని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నడి బొడ్డులోని సర్వే నంబర్ 2477 లోని గంగోని కుంట విస్తీర్ణంలో 12 ఎకరాల 16 గుంటలు ఉండాలని కానీ కబ్జాదారుల కోరల్లో పడి ఇప్పుడు కనీసం 6 ఎకరాలు కూడా లేదని సమ్మయ్య వాపోయారు. అలాగే జమ్మికుంట రోడ్డుకు ఇరువైపులా ఉన్న మాడల్ చెరువు నుండి చంద్రవోని కుంట, గుండ్ల చెరువులకు నీటిని తీసుకెళ్లే కట్టు కాలువలు పూర్తిగా కబ్జాలు ఐనాయని ఎన్నోసార్లు మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యమని, రాబోయే వానాకాలంలో జమ్మికుంట రోడ్డులోని పలు కాలనీలు నీట మునగడం ఖాయమని రాబోయే నీటి ముంపుకు ఫిర్యాదులు పట్టించుకోని సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని సమ్మయ్య ముదిరాజ్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ టౌన్ లో గంగోని కుంట శిఖం భూమి, బట్టోని కుంట, కట్టు కాలువలతో పాటు వరంగల్ రోడ్డును అనుకోని ప్రవహించే చిలుక వాగును కూడా ఇరువైపుల కబ్జాలు చేసి వాల్టా చట్టాన్ని విస్మరించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని గత నెలలో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశానని, దానిపై హుజురాబాద్ యంపిడిఓకి ఆదేశాలు అందిన కూడ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని, దానికి చిలుకవాగు పక్కన యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణమే నిదర్శనమని సమ్మయ్య అన్నారు. ఇక్కడి ప్రభుత్వ అధికారులు చెరువులు, కుంటలు వాగుల కట్టు కాలువల కబ్జాలను ఫిర్యాదులు ఇచ్చిన ఎందుకు పట్టించుకోవడం లేదో వాల్టా చట్టం అమలు పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ముఖ్యమంత్రి కార్యాలయంలో ముదిరాజ్ మహాసభ పక్షాన పిర్యాదు చేసి తేల్చుకుంటామని సమ్మయ్య ముదిరాజ్ పేర్కొన్నారు.



విలేకరులతో మాట్లాడుతున్న ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య





