
– రైతు బోనస్ బోగస్ అయింది, అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ అందాల పోటీలను ప్రారంభించడం మానుకొని రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఇల్లందకుంట మండలం కనపర్తి గ్రామంలో అకాల వర్షం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల సందర్భంగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన అన్నారు. రైతులు పూర్తిస్థాయిలో కోతలు జరిగినప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. రైతుల కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి బోగస్ మాటలు చెప్పారని అన్నారు. రైతులు పండించిన పంటలకు బోనస్ ఇవ్వడం పక్కన పెడితే కనీసం కొనుగోలు చేసే దుస్థితి కూడా లేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి నష్టం వచ్చిన పరవాలేదని కెసిఆర్ ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ అందాల పోటీలలో ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం మొత్తం తడిసి రైతన్నలు ఏడుస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలతో తెలిసిన ధాన్యాన్ని రైతులు రోడ్లపైనే ఆరబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకోవాలని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ధాన్యాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇల్లందకుంట మండలం కనపర్తి గ్రామంలో అకాల వర్షం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి