
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని బతుకమ్మ సౌల్ల వద్ద ఆదివారం ట్రాలీ ఆటో డీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం ప్రకారం… బొడిగె సందీప్(25) అనే యువకుడు తన స్కూటీపై బతుకమ్మ సౌల వద్ద వస్తుండగా ఎదురుగా వస్తున్న TS02 UD 0829 ట్రాలీ ఆటో నడుపుచున్న దాని డ్రైవర్ దానిని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి మోటర్ సైకిల్ ను ఢీకొనడంతో సందీప్ కు తీవ్ర గాయాలయ్యాయని వెంటనే అతడిని హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ సందీప్ అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలు శ్రీత్విక్, ఆయన్ష్ లు ఉన్నారు. మృతుడు బొడిగ సందీప్ భార్య బొడిగ ప్రత్యూష (25) ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంటనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, మార్చురీలో సందీప్ మృతదేహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇస్తూ, సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.




ఆస్పత్రిలో మృతదేహాన్ని చూసి, కుటుంబ సభ్యులను పరమర్శిస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి





