Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఏదో ఒక మార్గంలో డబ్బులు దండుకోవాలనే ఉద్దేశ్యంతో అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. డబ్బుల కోసం ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు టోకరా పెడదామని చూసిన కేటుగాళ్లకు ఆమె తేరుకుని చెక్ పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.
హుజూరాబాద్ పట్టణానికి చెందిన మూబిన్ – నుస్రత్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే ఒక పోలీస్ అధికారి డిపి తో ఉన్న నంబర్ నుండి నుస్రత్ కు ఫోన్ వచ్చింది. అటు నుండి మాట్లాడిన సైబర్ నేరగాడు మొదట వివరాలు అన్ని తెలుసుకున్నాడు. అనంతరం నీ కూతురు ఒక కేసులో ఇరుక్కుందని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తే నిజం ఒప్పుకుందని కేసు కాకుండా ఉండాలంటే తమకు ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫోన్ పే ద్వారా పే చేయాలని కోరాడు. ఎక్కడో ఒక దగ్గర అనుమానం వచ్చిన నుస్రత్ వెంటనే కాల్ కట్ చేసి తన భర్తకు ఫోన్ చేసి తన కూతురు గురించి ఆరా తీయమని చెప్పింది. దీంతో భర్త మూబిన్ కాలేజ్ కు వెళ్ళి కూతురికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేయడంతో సైబర్ నేరగాళ్ల పనే అని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి మూబిన్ దంపతులకు వారి గురించి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎవరికైనా అనుమానం వస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.






