
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం చెత్తాచెదారంతో నిండిపోయింది. ప్రభుత్వా నిబధనలకు విరుద్ధంగా క్రీడా మైదానంలో పటాకుల దుకాణాలకు అనుమతి ఇవ్వగా వారు పటాకుల చెత్తాచెదారాన్ని నిర్లక్ష్యంగా అక్కడే వదిలేయడంతో తీవ్ర దుర్గంధముగా మారింది. నిత్యం ఉదయం వాకింగ్ రన్నింగ్ చేసేందుకు పట్టణానికి చెందిన సుమారు 2వేల మంది ఈ క్రీడా మైదానానికి చేరుకొని వాకింగ్ రన్నింగ్ ఎక్సర్సైజ్ ఓపెన్ జిమ్ తదితర వ్యాయామలు చేస్తుంటారు. వాకింగ్ ట్రాక్‌పై ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు దర్శనం ఇవ్వడంతో వాకింగ్ చేయడానికి పలువురు ఇబ్బందులు పడ్డారు. నిన్న దుకాణాలు తొలగించడంతో ఈరోజు వరకు గ్రౌండ్లో చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించకపోవడంతో ఇక్కడి చెత్త అక్కడే పేరుకు పోయింది. గత ఏడాది ఒక్క దుకాణానికి మున్సిపల్ టాక్స్ పేరుతో ₹ 3000 రసీదు చింపగా ఈ ఏడాది ₹ 5500 చొప్పున రసీదు చింపడం జరిగిందని బల్దియ సిబ్బంది తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన విద్యుత్తునే పటాకుల దుకాణదారులు నాలుగు రోజులపాటు వాడుకోగా మళ్లీ చెత్తాచెదారాన్ని ఎవరికి వారే డబ్బలో వేసి ఒక వద్ద ఉంచితే మున్సిపల్ సిబ్బంది వచ్చి తొలగించాల్సి ఉండగా మాకు ఏమీ పట్టదు అన్నట్లుగా పటాకుల దుకాణదారులు చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వదిలేయడంతో క్రీడా మైదానం మొత్తం చెత్తతో చిత్తడిగా మారి వాకర్స్ కు తీవ్ర ఇబ్బంది కలిగింది. అంతేకాక ఎంతో చదునుగా ఉన్న క్రీడ మైదానాన్ని బొంగులు, వాసాలు పాతెందుకు రంధ్రాలు చేసి గుంతల మయంగా క్రీడ మైదానాన్ని మార్చారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి తక్షణమే క్రీడా మైదానంలో చెత్తాచెదారాన్ని తొలగించి పూర్వపు క్రీడామైదానంగా తీర్చిదిద్దాలని వాకర్స్, క్రీడాకారులు కోరుతున్నారు.









