
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సిద్దిపేట): ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ఎందుకు నిర్లక్ష్యం చూపుతుంది ? ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో పేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటుతున్నా సిఎం రేవంత్ రెడ్డి, రెడ్డి కార్పోరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయకుండా నిధులు కేటాయించలేదని ఇతర హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలను అనగ తొక్కుతున్నారని మండి పడ్డారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిద్ధిపేట జిల్లా రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రెడ్డి, ఓసి రాష్ట్రస్థాయి వివిధ జిల్లాల ఐకాస నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయిలినేని మల్లిఖార్జునరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పామ్మగారి రాంరెడ్డి, రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రథాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి, ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ..


అన్నదాతలకు విద్యార్థులకు వివిధ వర్గాల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు ? రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే పాలకులు రైతుల సంక్షేమంపై ఇచ్చిన హామీల అమలులో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది ?
వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు ఎందుకు తగ్గాయి ? రెండు లక్షల రుణ మాఫీలో అర్హులైన మిగతా 70 శాతం రుణమాఫీ ఎందుకు పూర్తి చేయడం లేదు ? కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని నిలదీశారు.
ఇప్పటికే రెండు సార్లు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను సర్కార్ ఎందుకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు ? అన్ని పంటలకు రూ 500 బోనస్ ఇస్తామని ఎందుకు కొంత మేరకు మాత్రమే ఇస్తున్నారు? విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు నిలిచి పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని ప్రశ్నించారు.
నామ మాత్రంగానే ఓసి కార్పొరేషన్లు ప్రకటించిన ప్రభుత్వం వాటికి పాలక మండలి ఏర్పాటు చేయకుండా చట్ట బద్ధత కల్పించక నిదులు ఎందుకు కేటాయించలేదు? తక్షణమేచట్ట బద్దత గల రెడ్డి, ఓసి కార్పొరేషన్ లకు పాలక మండల్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు
గతంలో ఉన్న పాల ఉత్పత్తి దారులకు లీటరుకు 4 రూపాయల రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని రైతులను నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ సీడ్ కంపెనీల యాజమానుల ఆగడాలను అరికట్టాలని ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల పంటలను పూర్తిగా ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత ఖర్చుల పెరుగుదల ఆ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంతో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని కోరారు.

పోలాడి రామారావు మాట్లాడుతూ రైతు భరోసా నిధులను విడుతల వారీగా కాకుండా పంటల సాగు సమయంలోనే ఒకే సారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి విడనాడాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ధికంగా వెనుకబడిన ఓసిల సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకోసం.
ఏప్రిల్ 28న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల ఐకాస ఆధ్వర్యంలో లక్షలాది మందితో రాష్ట్ర వ్యాప్త రైతుల మహా గర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలి వచ్చి మహాగర్జన సభను విజయవంతం చేయాలని పోలాడి రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల రెడ్డి ఓసి ఐకాస జిల్లాల అధ్యక్షులు, నాయకులతో పాటు పలువురు రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.







