
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పర్యావరణానికి మూలమైన మొక్కలను ప్రతి ఒక్కరు బాధ్యతగా కాపాడాలని సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్ సంస్థ అధ్యక్షులు, సామాజికవేత్త వర్దినేని రవీందర్ రావు అన్నారు.

మంగళవారం హుజురాబాద్ విఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… మొక్కలను కాపాడడానికి ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.3000 కోట్లు కేటాయిస్తుందని వాటిని సంబంధిత అధికారులు సక్రమంగా వినియోగిస్తే వేసవిలో మొక్కలు బతుకుతాయని అన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో సంబంధిత అధికారులు మొక్కలకు నీరు ట్యాంకర్ల ద్వారా పోయించాలని అప్పుడు పచ్చదనంతో నిండిపోతుందన్నారు. వేసవికాలంలో నెల రోజులపాటు గ్రామపంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ల అధికారులు శ్రద్ధ తీసుకోవడం వల్ల రుతుపవనాలు త్వరగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. పట్టణాల్లో గ్రామాల్లో డివైడర్ల మధ్య పెట్టిన మొక్కలను కూడా ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పర్యావరణ ప్రేమికులు కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతోటి ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు అందించడమే కాకుండా వాటికి ట్రీ గాడ్స్ కూడా పెట్టాలని సూచించారు. హుజురాబాద్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో కమలాపూర్, ఎల్కతుర్తి ప్రాంతాల్లో మొక్కలకు నీరు అందించకపోవడంతో అవి ఎండిపోతున్నాయని లక్షలాది రూపాయలు వృధా అవుతున్నాయని అన్నారు. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే విధంగా తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని తన వంతు బాధ్యతగా ఇప్పటివరకు 55 వేల మొక్కలను నాటినట్లు రవీందర్ రావు తెలిపారు. చాలా గ్రామాల్లో వీధిలైట్లు నిరంతరం వెలుగుతుంటాయని దేనికి కారణం ఫోర్త్ వైరు కనెక్షన్ లేకపోవడమేనని 1200 గ్రామాల్లో ఇలా వీధిలైట్లు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాయనీ, దీనివల్ల విద్యుత్తు వృధా అవుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామంలో ఫోర్త్ వైర్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, విద్యుత్తు వాడకం వృధాను అరికట్టాలన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధంపై తీర్మానం చేసినప్పటికీ సక్రమంగా అమలు జరగడంలేదని అన్నారు. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం వల్ల అనేక వ్యాధులు ప్రబులుతాయని అందువల్ల ప్రతి ఒక్కరు స్టీల్ ప్లేట్లలోనే భోజనాలు చేయాలని అన్నారు. వివిధ శుభకార్యాలలో ప్రతి ఒక్కరూ పేపర్ ప్లేట్ల స్థానంలో స్టీల్ ప్లేట్లను వాడాలని ఆయన కోరారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవీందర్రావు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు

ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎం కొండల్ రెడ్డి, కొలిపాక సమ్మయ్య, సంపంగి రాజేందర్, వేల్పుల ప్రభాకర్, బుర్ర కుమార్, ప్రభాకర్ రెడ్డి, తులసి లక్ష్మణమూర్తి, మార్త రవీందర్, బాపురెడ్డి, పోతుల సంజీవ్, బి రాజలింగం తదితరులు పాల్గొన్నారు.





