
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: దాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురై వడ దెబ్బకు మృత్యువాత పడుతున్నారని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ లో ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి, సలహాదారు పెండ్యాల కేశవ రెడ్డీ,ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో కలిసి ఈనెల 30న కరీంనగర్ లో లక్షలాది మందితో ప్రజా సంఘాలతో నిర్వహించే రైతు మహాగర్జన సభ ఏర్పాట్లపై నిర్వహించిన సన్నాహక ఏర్పాట్ల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ కొనుగోళ్లు ప్రారంభమై 3 వారాలు గడుస్తున్నా నేటికీ సక్రమంగా కొనుగోళ్లు జరగడం లేదని రామారావు మండి పడ్డారు. కొనుగోలు చేసిన దాన్యం సైతం మిల్లులకు తరలించలేని అచేతన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తోందని మండి పడ్డారు.క్వింటాల్ కు 6 నుంచి 7కిలోల తరుగు పేరుతో రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్దతు ధరతో పాటు 500 రూ. బోనస్ ఎగొట్టేందుకే కొనుగోళ్లలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారన్నారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం రోడ్లు ఎక్కుతుండటం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. దాన్యాన్ని ఆర బెడుతూ జనగామ జిల్లాకు చెందిన గాండ్ల రవి అనే స్టేషన్ ఘనపూర్ ప్రాంత రైతు వడ దెబ్బకు మృత్యు వాత పడటం దిగ్భ్రాంతికి గురి చేసిందని పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క అన్న దాతలు కష్టాలలోకడలిలో ఉంటే ప్రతి పక్షాలు ఒకరిపై ఒకరు వ్యక్తి గత దూషణల పర్వంతో అన్నదాతల ఆక్రందనలు, ప్రజా సమస్యలు గాలి కొదిలి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం దారుణమన్నారు. ప్రజా సమస్యలు పక్క దారి పట్టి ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. ప్రతి పక్షాలు పాలక పక్ష వలలో కొట్టు మిట్టడు తున్నాయన్నారు. ప్రతి పక్ష పాత్రను తమ ప్రజా సంఘాలే సమర్ధ వంత మైన పాత్ర పోషిస్తాయని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు అండగా ప్రశ్నించే ప్రజా గొంతుక లా అండగా ఉంటూ వారి సమస్యలు ప్రస్తావిస్తున్నా మన్నారు. తక్షణమే ఎలాంటి తరుగు తీయకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరిపి 500రూ. బోనస్ డబ్బులు సైతం దాన్యపు డబ్బుల తో పాటు ప్రభుత్వం చెల్లించాలని పోలాడి డిమాండ్ చేశారు.అన్న దాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రైతు ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రాజకీయాల కతీతంగా ఈ నెల 30 న కరీంనగర్ లో రెండు లక్షల మంది తో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నామని పోలాడి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర కన్వీనర్ పెండ్యాల రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జున్నుతుల రాజిరెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల ఐకాస అధ్యక్షులు ఏనుగు చొక్కా రెడ్డీ, మహంకాళి రాజన్న, నలుమాసు ప్రభాకర్, పురుషోత్తం రావులతో పాటు నాయకులు పాల్గొన్నారు.







