
–జిల్లా విద్యాశాఖ అధికారుల కీలక ఆదేశాలు
–అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు ఊరట
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 17: కరీంనగర్ జిల్లాలోని అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కీలక ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ చేసిన వినతిపత్రాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి పిల్లలకు విద్యాభారం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
డీఈఓ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని సూచించారు.
ఈ నిర్ణయం జర్నలిస్టుల కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలిగించనుందని, విద్యా హక్కు ప్రతి చిన్నారికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులకు కూడా ఈ ఉత్తర్వుల ప్రతులు పంపించగా, అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీడియా వర్గాలు స్వాగతిస్తున్నాయి.





