
—పంటల కొనుగోళ్లలో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్
—హామీలు అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు
—రైతు, ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పాత విధానానికి స్వస్తి పలికి కేంద్ర కోటా మేరకే పంట కొనుగోలు చేస్తామని ప్రకటించి పంటల కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ చేతులెత్తేసి అన్నదాతలను వంచనకు గురిచేయడం దారుణమని రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మండిపడ్డారు.

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోళ్లపై పరిమితి విధించి మార్కెట్ యార్డు దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే అన్నదాతలు ఆగమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని వడ్లు పండించినా అన్ని పంటలకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ చెల్లించి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కేవలం ఏడు రకాల సన్నాలనే కొంటామని, కేంద్రం నిర్దేశించిన కోటాకు మించి కొనలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రైతులను దగా చేసిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల కొనుగోళ్లపై బోనస్, నీటి సరఫరా, కరెంట్ సరఫరాలపై కోతలు విధించి రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మరణించిన రైతు బీమాకు అర్హులైన 7,600 మంది రైతులకు రైతు బీమా అందించ లేదన్నారు. ఇప్పటికే మూడు విడతల రైతు భరోసా నిధులు రూ.16,545 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్ భరోసా డబ్బులతోపాటు పెండింగ్ బకాయిలు మొత్తం కలిపి 29,358 కోట్ల రూపాయలను 30న సీఎం రేవంత్ నిర్వహించే సభావేదిక ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ఏయే పంటల ఉత్పత్తులను మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందో అవే పంటలకు మాత్రమే అంతే మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లించి అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమేనని ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
గత యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యపు కొనుగోళ్లలో కేంద్రం వాటా మూడవ వంతు మాత్రమే కాగా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొంటున్న సమయంలోనే మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుండగా, ఇకమీదట అత్యధిక పంట ఉత్పత్తులను మార్కెట్లోనే తరలించాల్సి వస్తే ప్రైవేట్ వ్యాపారులు, దళారులు చెప్పిన ధరలకు రైతులు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోసహా బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, తదితర దేశాలకు 35 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం ఎగుమతి జరుగుతుందన్నారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న, పెసలు, కందులు, సోయాబిన్, తదితర పంటలు కొంటున్నట్లుగా, ఇదే తరహాలో మార్కెఫెడ్ ద్వారా వరిధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చి కేంద్ర అనుమతితో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు.
రైతులకు ఇచ్చిన హామీల అమలుపై డిమాండ్ల సాధనకు రైతు సమర భేరి సభ నిర్వహణలో ఆలస్యమైనా రైతులను చైతన్యవంతం చేసి పోరుబాట పట్టించడంలో, ప్రతిపక్షాలను మొద్దు నిద్ర నుంచి మేల్కొలిపి రైతు జేఏసీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఇచ్చిన హామీలు అమలుపరిచే వరకు జేఏసీ తరపున పోరుబాట చేసి రైతులకు అండగా ఉంటామని పోలాడి రామారావు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కల్లెపెల్లి రాజేందర్, జంపాల నర్సయ్య, అండెం రమణారెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.





