
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జులై 22 : రాష్ట్ర ప్రభుత్వము పెన్షనర్లకు ఎటువంటి సమాచారం లేకుండనే పెన్షనర్ల మే నెల పెన్షన్ నుండి1.5 శాతం పెన్షన్ను వైద్య సదుపాయం కొరకు కట్ చేసుకున్నారు.. కానీ ఇంతవరకు పెన్షనర్లకు ఎటువంటి హెల్త్ కార్డులు ఇవ్వలేదని టిజి ఆర్జిఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ పాషా, ప్రధాన కార్యదర్శి జాలి మహేందర్ రెడ్డి అన్నారు. ఆస్పత్రులలో పాత హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదనీ, చాలామంది పెన్షనర్లు హెల్త్ కార్డ్స్ లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. జేఏసీ సమావేశంలో జూన్ రెండో తారీకు నుండి రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు వైద్య సదుపాయం కొరకు నూతన ఆరోగ్య పథకము అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి దాని విషయము పట్టించుకోక పోవడం శోచనీయం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారము వెంటనే నూతన ఆరోగ్య పథకం యొక్క విధి విధానాలను రూపొందించి ఏఏ ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చునో అట్టి ఆసుపత్రుల వివరములను ముఖ్యంగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యము అందించే విధంగా పాలసీ విధానం రూపొందించాలని టీఎస్ జిఆర్ఈఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ పాషా ప్రధాన కార్యదర్శి జాలి మహేందర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.




