రెండు రోజులుగా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయని కొడుకులు, కూతుళ్లు
సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో అమానవీయముపై భగ్గుమంటున్న మానవతావాదులు
మండల యాదగిరి, స్వర్ణోదయం తెలంగాణ బ్యూరో: కని పెంచిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలంటారు. ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిది. అలాంటి అమ్మ మృతదేహాన్ని పట్టించుకోకుండా ఆస్తి కోసం కొడుకులు, బిడ్డలు కొట్టుకున్నారు. ఆస్తి తగాదాలు కొలిక్కి రాకపోవడంతో రెండు రోజులైనా ఆమె భౌతిక కాయాన్ని ఇంట్లోనే ఉంచి ఆమ్మకు అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈ అనారిక చర్య సంఘటన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కందులవారి గూడెంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వేము లక్ష్మమ్మ (80) అనే వృద్ధురాలు ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె వద్ద రూ.21 లక్షల విలువైన ఆస్తి, 20 తులాల బంగారం ఉంది. ఒక కుమారుడు ఇదివరకే మరణించగా, తల్లి మరణవార్త తెలుసుకున్న కుమార్తెలు, కోడలు, కుమారుడు కందులవారి గూడెంకు వచ్చారు. అంత్యక్రియల ను పక్కన పెట్టు ఆస్తి కోసం గొడవ పడ్డారు. ఈ విషయం గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి పంచాయితీ పెట్టుకునే వరకు వెళ్ళింది. రెండ్రోజులుగా ఈ గొడవ జరుగుతూనే ఉంది తప్ప.. పరిష్కారం కాలేదు. సంతానం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లక్ష్మమ్మ అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఆస్తికోసం కన్నబిడ్డలే తల్లికి దహనసంస్కారాలు చేయకుండా ఆలస్యం చేయడంపై మానవతావాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంతానం తల్లిదండ్రులకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






