
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపచేయాలని, అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం రోజున స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం పండించే రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్గు రూపాయలు 500 బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటనలు వస్తున్నాయన్నారు.
ఈ వార్తతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసిందని, మామిడి కాయలు నేలరాలాయని, పిడుగుపాటుతో ఆవులు, గేదెలు చనిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోకవడం విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు దొడ్డు వడ్లను 80% శాతం పండిస్తారని, సన్న వడ్లను 20% మాత్రమే పండిస్తారని అన్నారు. దొడ్డు వడ్లను పండించే రైతులు అధికులు సన్నా చిన్నకారు రైతులేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా క్వింటాల్ వడ్లకు రూపాయలు500 బోనస్ చెల్లిస్తామంటూ వాగ్దానం చేసిందని, కానీ సన్న బియ్యం, దొడ్డు బియ్యం అంటూ ఎక్కడ ప్రస్తావించలేదు అన్నారు. ఇప్పుడు సన్న బియ్యం పండించే రైతులకు మాత్రమే బోనస్ వస్తుందనే వార్తలు రైతులను తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయని అన్నారు.అన్ని రకాల వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయిల 500 బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆసంగి సీజన్ నుండి బోనస్ చెల్లింపు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ఉన్న ఆందోళన తొలగించడం కోసం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షర తుల్లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాసు దేవారెడ్డి కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యు లు వెలమారెడ్డి రాజిరెడ్డి,, జిల్లా నాయకులు గుండేటి వాసుదేవ్ మండల నాయకులు ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.