
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ నివాసి అయిన డాక్టర్ కాటిపల్లి లింగారెడ్డికి భారత ప్రభుత్వ మేదో సంపత్తి హక్కుల విభాగం భారతీయ పేటెంట్ (ఉత్పత్తి మేదోసంపత్తి హక్కు) ను మంజూరు చేసింది.
“స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ డివైస్ ఫర్ స్మాల్ బిజినెస్ స్టాక్ అండ్ ఆర్డర్ ఫ్లో మేనేజ్మెంట్” అనే ఆవిష్కరణకు లింగారెడ్డి బృందానికి భారతీయ పేటెంట్ లభించింది.

డాక్టర్ కాటిపల్లి లింగారెడ్డి
చిన్న వ్యాపార సంస్థలలో స్టాక్(సరుకు) నిర్వహణ, ఇన్వెంటరీ ( సరుకు నిల్వల)పర్యవేక్షణ మరియు ఆర్డర్ ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పరికరం రూపొందించబడింది.


ఈ ఆవిష్కరణ ద్వారా మానవ తప్పిదాలు తగ్గడం, స్టాక్ కొరత లేదా అధిక నిల్వలను నివారించడం, వ్యాపార సామర్థ్యాన్ని పెంచడం సాధ్యమవుతుంది.
ఇది రియల్-టైమ్ ఇన్వెంటరీ సమాచారాన్ని అందించడం ద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
ఈ సాంకేతిక ఆవిష్కరణ, రిటైల్ దుకాణాలు, టోకు వ్యాపారులు, మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు, గిడ్డంగులు మరియు ఇతర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పేటెంట్ చిన్న వ్యాపారాల డిజిటల్ రూపాంతరానికి మరియు స్మార్ట్ వ్యాపార నిర్వహణకు తోడ్పడుతుంది.

దీనివల్ల స్టాక్ కదలికలు, ఇన్వెంటరీ నవీకరణలు మరియు ఆర్డర్ ప్రాసెసింగ్‌కు సమర్థవంతమైన కార్యాచరణ విధానం రూపొందించబడింది.
ఈ పేటెంట్ సాంకేతికత ఆధారిత వినూత్న పరిష్కారాల ద్వారా చిన్నవ్యాపారాల అభివృద్ధికి దోహదపడుతుంది.
ఈ పేటెంట్ అభివృద్ధిలో, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఫ్లోచార్ట్ రూపకల్పన మరియు అభివృద్ధిలో డాక్టర్ లింగారెడ్డి కీలక భూమికను నిర్వర్తించారు.
డాక్టర్ లింగారెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజరాబాద్ లో వాణిజ్య శాస్త్ర సహాయ ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. భారతీయ పేటెంట్ పొందిన లింగారెడ్డిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాదేవి, సహచర అధ్యాపకులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.





