
—జూనియర్ కళాశాలల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల కళాశాలల బంద్ కు పిలుపు…
–లక్షల మంది విద్యార్థులకు విద్యాప్రదాయిని అయిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వ కుట్ర…
—విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో SC,ST,BC,EBC విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని, తద్వారా వారి కుటుంబాలను ఆర్థికంగా, సామాజిక ఉన్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ABVP ఆధ్వర్యంలో జూలై 14వ తేదీన రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ABVP రాష్ట్ర నాయకులు గోస్కుల అజయ్ తెలిపారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రెస్మీట్లో లో నిర్వహించిన మీడియా సమావేశంలో అజయ్ మాట్లాడుతూ “రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని,4.5 మంది సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని,మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా,గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందనీ అన్నారు.
ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని,బడ్జెట్ కాలేజిలు సైతం మూతపడుతున్నాయని, పొట్టకూటి కోసం లెక్చరర్ గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు.రీయింబర్స్ మెంట్ , స్కాలర్షిప్స్ అనేవి విద్యార్థుల హక్కు అని ప్రభుత్వం వేసే బిక్ష కాదన్నారు.రీయింబర్స్ మెంట్ కోసం అడిగితే విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారని, నిరసన చేస్తే లాఠీచార్జీలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కానీ తెలంగాణ విద్యార్థులకు ఇవి కొత్తేమీ కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని,ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని, అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తాయన్నారు.పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన ABVP ఆధ్వర్యంలో జూలై 14 తేదీన నిర్వహించబోయే రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ ను విద్యార్థులు, తల్లిదండ్రులు,మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెరుగు అభిలాష్, నగర సంయుక్త కార్యదర్శి రామ్ చరణ్, రాజు, నగరు ఉపాధ్యక్షులు, సాయి చరణ్, సాత్విక్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.





