
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో రెండు లక్షలకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఆర్ధిక పరిస్థితి నెపంతో ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ నిధుల చెల్లింపులు, కొత్త ఉద్యోగ నియామాకాలను చేపట్టకుండా ఉండేందుకే రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచి నిరుద్యోగ సమస్యకు కారణమవుతున్నారని రామారావు మండి పడ్డారు.
ఆదివారం కరీంనగర్ లో ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు.


తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంటికో ఉద్యోగం నినాదం పేరుతో అధికారంలోకి వచ్చిన గత పాలకుల 10ఏళ్లలో ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేసి నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేసి వారి అగ్రహానికి పాలకులు మూల్యం చెల్లించుకున్నారని అన్నారు.
యువతకు ఉద్యోగాలు, అన్నదాతలకు అండగా ఉంటామని అధికారంలోకీ వచ్చిన ప్రస్తుత పాలకులు పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 26వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు.
రెండు లక్షలకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో కుంటి సాకులతో కాల యాపన చేస్తున్నారని విమర్శించారు.
ఫీజు రీయంబెర్స్ మెంట్ నిధులను కూడా చెల్లింపులు చేయడం లేదన్నారు. నిరుద్యోగ భృతి హామీని ఆట కెక్కించారన్నారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రాష్ట్రంలో పాలక ప్రతి పక్షాలు ఒకరి పై ఒకరు వ్యక్తి గత విమర్శలకు దిగి డైవర్షన్ పాలిటిక్స్ కీ పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఖాళీగా ఉన్న కోటి 68 లక్షల ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణమే భర్తీ చేయాలని రామారావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రైతుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వచ్చే నెలలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుటకు సమావేశంలో తీర్మానించినట్లు సమావేశం అనంతరం మీడియాకు పోలాడి రామారావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి తాడిశెట్టి పశుపతి, కొత్తకొండ రవీందర్ రావు, పోరెడ్డి సత్యనారాయణరెడ్డి, అండెం ప్రభాకర్ రెడ్డి, మహంకాళి రాజన్న, వేముల సుదర్శన్ రెడ్డి, మూగల మహేందర్ రెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్ రావు, జంపాల నర్సయ్య, బచ్చు ఆనందం తదితరులతో పాటు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

తెలియజేస్తున్న వారు: విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ హుజురాబాద్.





