
—ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేద్దాం
—ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే ప్రజల భాగస్వామ్యమే కీలకం..
—మంత్రి పొన్నం ప్రభాకర్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో రైన్వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి (మాండేటరీ) చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.


కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా ఎల్‌నినో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలందరూ ఇంకుడు గుంతలు నిర్మించేలా యుద్ధ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి పంపించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఉమ్మడి గొంతుకతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. ప్రకృతి విపత్తును సమిష్టిగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ దేవాలయాల్లో వరుణ యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిద్దామని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రజలను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు విడుదల చేసి రాష్ట్రానికి అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

“ప్రకృతి విపత్తును ఎవరూ ఒంటరిగా ఎదుర్కోలేరు… ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసికట్టుగా కదిలితేనే ఎల్‌నినో సవాల్‌ను అధిగమించగలం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, సుడా చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, తదితరులు ఉన్నారు.
–

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
తెలియజేస్తున్న వారు: విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్, హుజురాబాద్.





