
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానపరచడమేనని అన్నారు.
ప్రతిపక్షం ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం, విమర్శిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం బీజేపీ పాలనలో నిత్యకృత్యంగా మారిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం, నిరంకుశ ధోరణితో వ్యవహరించడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.
దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్ యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

తెలియజేస్తున్న వారు: శ్రీ గోస్కుల వివేక్, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





