
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూలై 22 : తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అన్నదాతలు, నిరుద్యోగుల సమస్యలను రాష్ట ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి డిమాండ్ చేశారు.

బుధవారం ప్రభావతిరెడ్డి మాట్లాడుతూ… సాగునీటి కొరత, ఎరువులు, విత్తనాల లభ్యత, పంటలకు గిట్టుబాటు ధర, విద్యుత్ అంతరాయం లాంటి సమస్యలతో దేశానికి వెన్నెముకైన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే రాష్ట ప్రభుత్వం సాగునీరు అందించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు రైతాంగంపై ఉన్న రుణభారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన అన్ని ప్రభుత్వ సహాయ పథకాలను సకాలంలో అందించాలని అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, రైతాంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 26వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. 2లక్షలకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో కుంటి సాకులతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా చెల్లించడం లేదన్నారు. నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నిరుద్యోగుల, విద్యార్థుల ఫీజురియంబర్స్మెంట్ సమస్యలను పరిష్కరించాలని ఓసీ జేఏసీ తరుపున ప్రభావతిరెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సాధికారత, భద్రత, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని రంగాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గోస్కుల వివేక్ గారు, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





