
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు పిలుపునిచ్చారు.

శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు, వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఛలో పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్ధరించడం, జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావడం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం అమలు, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు పూర్తి చట్టబద్ధత కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు గతంలో అమలులో ఉన్న 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీని కోవిడ్ సమయంలో నిలిపివేశారని, ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడంతో వేలాది మంది పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సౌకర్యాన్ని వెంటనే తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా రంగం విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పలు రాష్ట్రాల్లో రిటైర్డ్ జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులపై దాడులు, హత్యలు, అక్రమ కేసులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రత్యేక జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించడంతో పాటు పాత్రికేయ సంఘాలు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూముల కేటాయింపుపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి, దేశవ్యాప్తంగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. బీసీ జేఏసీ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు టి డబ్ల్యూ జేఎఫ్ చేస్తున్న ధర్నాకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్, నాయకులు రాఘవుల శ్రీనివాసు, రాజేంద్రప్రసాద్, ఇప్పకాయల సాగర్, శంకర్, శ్రీనివాస్, రవీందర్, కొండ గణేష్, సందేల వెంకన్న, కొలిపాక క్రాంతికుమార్, మామునూరి ప్రవీణ్ కుమార్, సంగెం సత్యనారాయణ, శ్రీనివాస్, సంగెం శ్రీనివాస్, సొల్లు శంకర్, కొక్కుల రవీందర్, పిట్ట శ్రీనివాస్, గొల్లపల్లి రమణాచారి తదితరులు పాల్గొన్నారు.





