
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఇవ్వడానికి కోసం ఎప్పటికప్పుడు డిటిఆర్లను సిద్ధంగా ఉంచాలని టీజీ ఎన్ పిడిసిఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్)టి. మధుసూదన్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని డిపార్ట్మెంటల్, ప్రైవేట్ ఎస్ పిఎం షెడ్లను వరంగల్ చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) అశోక్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సామర్థ్యాల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు పనులను పరిశీలించి, వాటి నాణ్యత, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దెబ్బతిన్న డిటిఆర్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా మరమ్మతులు పూర్తి చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ప్రతి డివిజన్లో అవసరమైన మేరకు రోలింగ్ స్టాక్ అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కొనసాగుతున్నందున రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడం అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్న వెంటనే ప్రత్యామ్నాయ డిటిఆర్ ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను అత్యంత వేగంగా పునరుద్ధరించే విధంగా అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. వాటి మరమ్మతు ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైన విడిభాగాల నిల్వలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూచించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన సేవలందించేందుకు అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ తనిఖీలో డివిజనల్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్లు శ్రీనివాస్ గౌడ్, రమేష్, SPM షెడ్ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.





