Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఎస్సీ పంబాల కులస్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లు పంబాల కుల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు గొట్టె జమదగ్ని, కొరిమి నర్సింహస్వామి లు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ….
ఎస్సీ పంబాల కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలకై దరఖాస్తు చేసుకుని ఏడాదవుతున్నా అధికారులు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి జీవో సైతం జారీ చేసిందని,
సర్టిఫికేట్లు లేక విద్యార్థులు, ఉద్యోగార్థుల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
చంద్రుడు అనే వ్యక్తి యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని, అంబేద్కర్ స్టడీ సర్కిల్లో మెయిన్స్ కోచింగ్ పొందడానికి కుల ధ్రువీకరణ పత్రం అత్యవసరంగా కావాల్సి ఉందని, ఇలాంటి వ్యక్తులు ఎందరో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు, ఉద్యోగ అవకాశాలకు కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
గ్రామీణ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, దుర్గమ్మ తదితర దేవతలకు తాము పూజారులుగా వ్యవహరిస్తూ జమడిక, సుత్తి, పంబంబోడు, తాళాలు, పలక, వీరగోల, పరోజ్జోని వంటి సాధనాలను ఉపయోగిస్తామని తెలిపారు.
—కరీంనగర్ జిల్లాలోనే నిర్లక్ష్యం…
సిద్దిపేట, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ తదితర జిల్లాల్లో పంబాల కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని, కేవలం కరీంనగర్ జిల్లాలోనే వీటిని ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కుల సంఘం నాయకులు రౌతు అనిల్, కొరిమి అశోక్, కొరిమి పృథ్వీరాజ్, గుంటి శివ, గుంటి విష్ణు, గుంటి నర్సింహులు, కొరిమి గణేష్, కొరిమి దినేష్ తదితరులు పాల్గొన్నారు.





