
—అంబేడ్కర్ చౌరస్తాలో భగ్గుమన్న అక్షర యోధులు..
—హోరెత్తిన రిలే నిరాహార దీక్షలు.
—స్వామిరెడ్డి పెట్టిన అక్రమ కేసును మంత్రులు వెంటనే ఉపసంహరింపజేయాలి..
-–20 ఏళ్ల పోరాట ఫలితాన్ని లాక్కోవాలని చూస్తే ఉద్యమం ఉధృతం…
—సమస్య తేలేవరకు అధికార కాంగ్రెస్ పార్టీ వార్తల సంపూర్ణ బహిష్కరణ…
—ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కాయిత రాములు కామని రవీందర్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జర్నలిస్టుల రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలతో దక్కించుకున్న ఇళ్ల స్థలాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అక్రమ కుట్రలను సహించే ప్రసక్తే లేదని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

గూడూరు స్వామిరెడ్డి పెట్టిన వివాదాస్పద కేసుపై రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆయనతో మాట్లాడి కేసును బేషరతుగా ఉపసంహరింపజేయాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు.
టీయు డబ్ల్యూజే (ఐజేయూ) హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వేదికగా జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ దీక్షా శిబిరానికి టీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన నగునూరి శేఖర్ దీక్షాపరులకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తే జర్నలిస్టులు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి దాదాపు 20 ఏళ్లుగా అలుపెరగని ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. ఎన్నో ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా ఇళ్ల స్థలాలను సాధించుకుంటే, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కక్షపూరితంగా అడ్డుపడుతూ న్యాయపరమైన చిక్కులు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. శ్రమజీవులైన మీడియా ప్రతినిధులను మానసిక క్షోభకు గురిచేస్తున్న ఇలాంటి వ్యక్తి వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బాధ్యతాయుతమైన మంత్రులు తక్షణమే రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించి, ఈ అక్రమ కేసును ఎత్తివేయించేలా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టుల ఆగ్రహ జ్వాలలు రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతాయని హెచ్చరించారు.



అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర నిరసన… వార్తల బహిష్కరణ…
ఇళ్ల స్థలాల వివాదంపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి కామిని రవీందర్ లు ధ్వజమెత్తారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై కాంగ్రెస్ అధిష్ఠానం తన స్పష్టమైన వైఖరిని తేల్చి చెప్పే వరకు, ఇళ్ల స్థలాల సమస్య కొలిక్కి వచ్చేంతవరకు హుజురాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని రకాల వార్తలు, ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలను సంపూర్ణంగా బహిష్కరిస్తున్నట్లు వారు తీవ్ర స్వరంతో ప్రకటించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు కేదాసి శ్రీధర్, నిమ్మటూరి సాయికృష్ణ, సమ్మెట సతీష్, బొడ్డు శ్రీనివాస్, మచ్చిక చందు, టేకుల సాగర్, పోతరాజు సంపత్, బండి సాయికృష్ణ, నాగవెళ్లి రాజు, బొడ్డు శ్రీనివాస్, భారత రజనీకాంత్ లు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ గౌడ్,మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సామాజికవేత్త సబ్బానీ వెంకట్,బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్,వెంకటేష్, దేవసాని ప్రియదర్శిని,జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాడుగుల ఓదెలు, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.. స్వామిరెడ్డి వైఖరి నశించాలి” అంటూ నినదిస్తూ అంబేడ్కర్ చౌరస్తా పరిసరాలను హోరెత్తించారు. కళాకారుల ఆటపాట పలువురుని ఆకట్టుకున్నాయి.





