
– ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలను కాపాడాల్సిన బాధ్యత నాయకుల, అధికారులదే.. –మూడో రోజుకు చేరిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇచ్చి, సర్వే నంబర్లు కేటాయించి, ఇంటి నంబర్లు సైతం మంజూరు చేసిన జర్నలిస్టుల నివేశన స్థలాలపై అక్రమ కేసులు పెట్టి వారిని రోడ్డుపైకి లాగడం కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి, అసమర్థతకు పరాకాష్ట అని సీపీఐ సీనియర్ నాయకులు మర్రి వెంకటస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించకుండా అధికార యంత్రాంగం కాలయాపన చేస్తే సహించేది లేదని, అవసరమైతే ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి జర్నలిస్టుల నివేశన స్థలాలపై అక్రమంగా కేసులు నమోదు చేయించడాన్ని నిరసిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాత్రికేయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఐ సీనియర్ నాయకులు మర్రి వెంకటస్వామి జర్నలిస్టులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

పట్టాలు ఇచ్చింది ప్రభుత్వమే.. రక్షించాల్సింది కూడా ప్రభుత్వమే..
ఉపఎన్నికల సమయంలో అప్పటి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ తదితర అధికారుల సమక్షంలో ఇంటి నంబర్లు కేటాయించి, చట్టబద్ధంగా 120 గజాల స్థలాలకు పట్టాలు అందజేశారని వెంకటస్వామి గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ఆధారంగా జర్నలిస్టులు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని, అందరికీ ఇంటి నంబర్లు సైతం మంజూరయ్యాయని తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ఉన్న భూమి విషయంలో అధికారులు వాస్తవాలను న్యాయస్థానం ముందుంచి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కోర్టు పేరుతో చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. న్యాయస్థానం నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు లేనప్పటికీ అధికారులు, నాయకులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


–ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి..
జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించడంతో పాటు, అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్న బాధిత జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తక్షణమే స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, ఆర్డీవోలు వెంటనే దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్య పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత జర్నలిస్టులు, జేఏసీ నాయకులు వంగల హనుమంత్ గౌడ్, వేల్పుల రత్నం, ఓసి జెఎసి నాయకురాలు ప్రభావతిరెడ్డి, బీసీ జెఏసి నాయకులు చందుపట్ల జనార్ధన్, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య, ప్రజా సంఘాల నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—జమ్మికుంట ప్రాంతంలో కాంగ్రెస్ వార్తలను బహిష్కరిస్తాం…

జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాస్…
హుజురాబాద్ జర్నలిస్టుల స్థలాలపై కోర్టు కేసును కాంగ్రెస్ నాయకుడు స్వామి రెడ్డి విత్ డ్రా చేసుకునేలా హుజరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని లేనియెడల జమ్మికుంట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వార్తలను బహిష్కరిస్తామని జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాస్ హెచ్చరించారు. హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు జమ్మికుంట ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా హుజురాబాద్ జర్నలిస్టులు ఎదురుచూస్తున్న నివేషణ స్థలాలను పొందినప్పటికీ వాటిపై కాంగ్రెస్ నాయకుడు స్వామి రెడ్డి కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట జర్నలిస్టులు నసిరుద్దీన్, సదానందం, భీమన్న, సాయికుమార్, రవి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కాకతీయ జూనియర్ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





