Oplus_16908288
—హుజురాబాద్లో రెండో రోజుకు చేరిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు… - మీడియా ప్రతినిధులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు…
—వీణవంకలో సైతం కాంగ్రెస్ వార్తల భాహిష్కరణ జర్నలిస్టుల హెచ్చరిక…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ నాయకుడు గూడూరి స్వామి రెడ్డి ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసులు వేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టుల న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం హుజురాబాద్ పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన బండ శ్రీనివాస్ వారికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

సుమారు రెండు దశాబ్దాలుగా నివేశన స్థలాల కోసం జర్నలిస్టులు అలుపెరగని పోరాటం చేశారని, వారి సంక్షేమాన్ని గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా స్థలాలను కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. జర్నలిస్టులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, అప్పులు తెచ్చి గూడు కట్టుకున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు అడ్డంకులు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమైన జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన అధికార పార్టీ, వారి కలను చిదిమేసే కుట్రలు చేయడం శోచనీయమన్నారు.

కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలి…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై వివాదాలు సృష్టిస్తున్న గూడూరు స్వామిరెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, పెట్టిన అక్రమ కేసును ఎప్పుడు ఉపసంహరించుకుంటుందో తక్షణమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధికా శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు అపరాధ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, ఎండీ గఫర్, సిర్సపల్లి సర్పంచ్ పోల్సని రామారావు, ఆమ్జద్, కౌన్సిలర్ లు కేసిరెడ్డి లావణ్య, ప్రతాప మంజుల, మారేపల్లి సుశీల, బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు జక్కని సంజయ్, బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకటేష్, నాయకులు చందుపట్ల జనార్ధన్, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య, తదితరులు పాల్గొని జర్నలిస్టుల పోరాటానికి మద్దతు పలికారు.

–ఉధృతమవుతున్న ఉద్యమం…
–వీణవంక జర్నలిస్టుల సంఘీభావం..
హుజురాబాద్ జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు పొరుగు మండలాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. రెండో రోజు దీక్షలో వీణవంక మండల జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదాన్ని పరిష్కరించాలని, లేనిపక్షంలో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు, వార్తలను సంపూర్ణంగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. సమస్య కొలిక్కి వచ్చేవరకు ఉమ్మడి పోరాటం కొనసాగిస్తామని జర్నలిస్టు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ దీక్షా శిబిరంలో వీణవంక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జె.సతీష్ ప్రధాన కార్యదర్శి పి. శంకర్,ఎమ్మే సాజిద్, కార్యదర్శి పరశురాం, ఓ రం సాగర్, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.





