
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఆగస్టు 22: ఎరువుల కొనుగోలు విధానం ఈ నెల 21 నుంచి మారిందని హుజూరాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు జి.సునీత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా అన్ని రకాల ఎరువుల విక్రయాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
కొత్త విధానంతో రైతులు జిల్లాలోని ఏ మండలంలోనైనా తమకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా అందిస్తామని, ఈ వానాకాలంలో రైతు అర్హత మేరకు ఇప్పటికే కొనుగోలు చేసిన బస్తాలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని అందిస్తామని వివరించారు. కొనుగోలుకు 20 రోజుల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు.
—ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న రైతులు మాత్రమే ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో నేరుగా ఎరువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రీ చేసుకోని రైతులు వెంటనే మీసేవ కేంద్రం లేదా సంబంధిత ఏఈఓను సంప్రదించాలని సూచించారు. కొత్త యాప్ అందుబాటులోకి వచ్చినందున పాత యాప్ అవసరం లేదని స్పష్టం చేశారు.
యాప్ లో బుకింగ్ చేసుకోవడంలో ఇబ్బంది ఉన్న రైతులకు డీలర్లు, వారి వద్ద ఉన్న వాలంటీర్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది సహకరిస్తారని తెలిపారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దని, సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో బుక్ చేసుకుని ఎరువులు పొందాలని సునీత సూచించారు. యాప్ పై సందేహాలుంటే సంబంధిత డీలర్ లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఆమె కోరారు.





