
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అమెరికన్-ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గత నెల 23న ప్రారంభమైన ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ గూడెపు స్వప్న ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 వ తరగతుల విద్యార్థులు దాదాపు 50 మంది ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు.
ఈ శిక్షణ శిబిరంలో సైన్సు, గణితం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ తో పాటు స్క్రాచ్ కోడింగ్( యానిమేషన్) కు సంబంధించిన వివిధ విషయాలపై విద్యార్థులకు శిక్షణను ఇచ్చినట్లు అమెరికన్- ఇండియా ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ గూడెపు స్వప్న తెలిపారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.తిరుమల అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తాము నేర్చుకున్న నైపుణ్యాభివృద్ధి అంశాలను ప్రాజెక్టుల రూపంలో తరగతి గదులలో ప్రదర్శించారు. వారు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు బొరగాల తిరుమల మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని మరింత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అమెరికన్- ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు శృతి, జస్టి అలెక్స్, మహేందర్, మహేష్, గూడెపు స్వప్న, పాఠశాల టీచర్స్ ఆసియా, వ్యాయామ ఉపాధ్యాయులు సొల్లు సారయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు కొండ సత్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు బొరగాల తిరుమల ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ శిక్షణ శిబిరం తమ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తల్లిదండ్రులు అమెరికన్- ఇండియా కోఆర్డినేటర్ గూడెపు స్వప్న కృషిని కొనియాడారు.
