
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకుని పట్టపగలే ప్రైవేట్ భూములను ఆక్రమిస్తున్న ఘటన హుజూరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అన్ని చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండి, మూడు వైపులా స్పష్టమైన హద్దు రాళ్లు ఉన్న స్థలంలోకి చొరబడి, ఒక హద్దు రాయిని పెకలించి అక్రమ నిర్మాణం చేపడుతున్న వైనం స్థానికంగా పెను దుమారం రేపుతోంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం:
హుజూరాబాద్ పట్టణ పరిధిలోని 9వ వార్డు (సర్వే నంబర్ 1988/A/C/A) లోని 242 గజాల స్థలాన్ని బోరగాల సులోచన వద్ద నుంచి సబ్బని వరలక్ష్మి చట్టబద్ధంగా సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. అయితే, గత జూన్ 25న వార్డ్ ఆఫీసర్ ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం పేరిట సదరు స్థలంలోకి ప్రవేశించి జియో ట్యాగింగ్, మార్కింగ్ చేశారు.

ఆ తర్వాత బరిగె సమ్మయ్య, పాక స్వరూప, పాక సాయికిరణ్, బోనగిరి నరసయ్యలు హద్దు రాయిని బలవంతంగా తొలగించి, స్థలంలోకి చొచ్చుకొచ్చి పిల్లర్లు వేసి గోడ నిర్మాణం ప్రారంభించారు. దీనిని ప్రశ్నించిన బాధితురాలు వరలక్ష్మి, ఆమె భర్త వెంకటస్వామిపై కబ్జాదారులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మా వార్డులోకి వచ్చి ప్రశ్నిస్తే చంపేస్తాం” అని నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో ప్రాణహాని బెదిరింపులకు దిగారు.


అధికారుల తీరుపై మండిపాటు:
గత 5 నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం సాగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాధితులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా మున్సిపల్ కార్యాలయంలో, ఆర్డీవో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బాధితులపైనే రివర్స్ కేసులు:

తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కబ్జాదారులే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితులపై తప్పుడు ఫిర్యాదులు చేయడం ‘ఉల్టా చోర్ కొత్వాల్‌ను కొట్టినట్లు’ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ సిరిపాటి వేణు గారు, బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.*





