
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ :అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి
డిమాండ్ చేశారు.

శనివారం కరీంనగర్ లో హోటల్ శ్రీనివాస్ లో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉమ్మడి జిల్లాల ఓసీ ఐకాస, రెడ్డి జేఏసీ, బహుజన కుల సంఘాల జేఏసీ నాయకులు, ప్రతినిధులతో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమంపై సమావేశం నిర్వహించారు.
అన్ని వర్గాల పేదలకు సమన్యాయమే లక్ష్యం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఏ కులానికీ, మతానికీ, సామాజిక వర్గానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించి, అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు న్యాయం జరిగేలా ఆర్థిక స్థితిగతుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికే లబ్ధి పొందిన కుటుంబాలకే పునరావృతమవుతున్నాయనే అభిప్రాయాల నేపథ్యంలో, అర్హులైన ఇతర పేదలకు కూడా అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీమీలేయర్ నిబంధనలు, అర్హత ప్రమాణాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమీక్ష అవసరమని అభిప్రాయపడ్డారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తరహాలో అన్ని సామాజిక వర్గాల్లోని పేదలకు అవకాశాలు కల్పించే విధానంపై అధ్యయనం చేయాలని కోరారు.
చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి
దేశంలోని అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల అమలుకు అవసరమైన చట్టపరమైన అంశాలను పరిశీలించాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ అంశాన్ని పార్లమెంట్లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథయాత్రకు ఓసీ జేఏసీ, రెడ్డి జేఏసీ, బహుజన కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు నాయకులు తెలిపారు.
ఈ రథయాత్ర అక్టోబర్ 24న ఆదిలాబాద్‌లో తెలంగాణలోకి ప్రవేశించి, అక్టోబర్ 26న జనగామ, హనుమకొండ మీదుగా సాయంత్రం 4 గంటలకు పరకాలకు చేరుకుంటుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 26న సాయంత్రం 5 గంటలకు పరకాలలో ఓసీ జేఏసీ, రెడ్డి జేఏసీ, బహుజన కుల సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 10 వేల మంది ని సమీకరించుటకు తీర్మానించారు.
అనంతరం సమావేశానికి సంబంధించిన గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా కన్వీనర్ జున్నుతుల రాజిరెడ్డి, బ్రాహ్మణ సంఘాల జిల్లా అధ్యక్షులు కొత్త కొండ రవీందర్ రావు, ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంఘాల జేఏసీ అధ్యక్షులు జంపాల నర్సయ్య బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్,నాయకులు పోల్సాని దేవేందర్ రావు నాయకులు రావుల కిరణ్ రెడ్డి, అండెం రమణ రెడ్డి, దాసరి గోపి,వెన్నమ నేనివిక్రమ నరసింగరావు,తోపు చర్ల శ్రీనివాస్ శ్రీనివాస్ రావు తదితర రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు





