
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నల్గొండ పట్టణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు ఎండీ అజ్జు, ప్రధాన కార్యదర్శి బోరగాల కుమార్ (రాజు), ఉపాధ్యక్షులు రాసపల్లి సరోజన మాట్లాడుతూ.. నల్గొండ పట్టణానికి చెందిన బాలకృష్ణ, అతని తల్లి కలిసి పారిశుధ్య కార్మికురాలు నల్గొండకు చెందిన చందుపట్ల రమణమ్మపై అకారణంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మండిపడ్డారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ నిరంతరం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులపై ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఖండించారు.
దాడికి పాల్పడిన బాలకృష్ణ, అతని తల్లిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో కార్మికులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు రామగిరి సులోచన, క్రాంతి కుమార్, కోశాధికారి రెంటాల రాజేశ్వరి, సహాయ కార్యదర్శులు కొలుగూరి కుమార్, అన్నపూర్ణ, కార్యవర్గ సభ్యులు మహేష్, కుమార్, భాగ్య తదితర కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




