
–రాంపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జైపాల్ రెడ్డి, సరిత దంపతులు
–రూ. 3 కే 5 లీటర్ల నీరు.. ఉచితంగా వాటర్ కార్డుల పంపిణీ
—త్వరలో ఉచిత కంటి వైద్య శిబిరం, అంతిమయాత్ర రథం ఏర్పాటుకు హామీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, నవంబర్ 22: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి, చైర్మన్ సరిత దంపతులు పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 24 గంటల మినరల్ వాటర్ ప్లాంట్‌ను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు కుటుంబం నుండి వచ్చిన తాను, హైదరాబాద్‌లో వైద్య రంగంలో సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వినియోగిస్తున్నానన్నారు. గ్రామ సర్పంచ్ ముశం సంగీత గణేష్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ విజ్ఞప్తి మేరకు ఈ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. కేవలం రూ. 3 కే 5 లీటర్ల శుద్ధమైన నీటిని అందిస్తామని, గ్రామస్తులకు రూ. 100 బ్యాలెన్స్‌తో ఉచిత వాటర్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు.

వచ్చే నెలలో కంటి శిబిరం, త్వరలో అంతిమయాత్ర రథం:
ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు మండలంలో 1,300 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, 4 వేలకు పైగా ఇతర సర్జరీలు చేయించామని, 12 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని వివరించారు. వచ్చే నెల మొదటి వారంలో రాంపూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని, గ్రామస్తుల కోరిక మేరకు ఒకటి రెండు నెలల్లో అంతిమయాత్ర రథాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే మండల ప్రజల కోసం 20 ఫ్రీజర్ బాక్సులను అందుబాటులో ఉంచామన్నారు.

ఫౌండేషన్ చైర్మన్ సరిత మాట్లాడుతూ.. ఇప్పటికే మండలంలోని 6 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, శుభకార్యాల కోసం ఇక్కడే కూలింగ్ వాటర్ సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు. ప్లాంట్ నిర్వహణకు గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




