
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ మరియు బుక్ స్టాల్ లో జరిగే అక్రమాల గురించి గురువారం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎన్ఎస్ యుఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యుఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ హుజురాబాద్ లో ఎమ్మార్వో మరియు ఎంఈఓలను కలిసి హుజురాబాద్ లో జరిగే బుక్స్ స్టాల్ ల దోపిడీ మరియు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో పుస్తకాలు మరియు దుస్తువులలో యాజమాన్యాల దోపిడీ గురించి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. హుజురాబాద్ లోని ప్రైవేట్ విద్యాసంస్థలు మరియు బుక్ స్టాళ్లు గుమ్మిగుడి కమిషన్ దందా నడుపుతూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను మా వద్దనే బుక్స్ కొనుగోలు చేయాలని, వారు నిర్దేశించిన రేటులకే కొనుగోలు చేయాలని కండిషన్లు పెడుతున్నారన్నారు. గవర్నమెంట్ నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువకు అమ్ముతూ జిఎస్టి బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వానికి వచ్చే లాభాలను గండికొడుతూ అటు ప్రభుత్వంని ఇటు నిరుపేద పిల్లల తల్లిదండ్రులను మోసం చేస్తూ వారి గల్లా పెట్టెలను నింపుకుంటున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. తక్షణమే ఈ కమిషన్ దందాలని ఆపాలని లేనియెడల ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగిందన్నారు. మేము చేసే నిరసన కార్యక్రమాలకు పూర్తి బాధ్యత అధికారులే వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ తో పాటు కరీంనగర్ జిల్లా కార్యదర్శి అభిలాష్, శివ తదితరులు పాల్గొన్నారు.







