
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: హుజూరాబాద్ ప్రాంతంలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి హుజూరాబాద్ పట్టణంతో పాటు మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో పలువురి ఇళ్లు నీట మునుగగా, దుకాణాలల్లోకి నీరు చేరడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. అలాగే అనేక చోట్లా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. శుక్రవారం అర్ధరాత్రి నుండి నుండి ఆదివారం వరకు హుజూరాబాద్ పట్టణంతో పాటు మండలంలో ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. మండలంలో శుక్రవారం ఉదయం 8గంటల వరకు మాత్రమే 33.2 మిల్లీ మీటర్ల వర్షాపాతం, శనివారం ఉదయం 8గంటల వరకు 15.2మిల్లీ మీటర్లు వర్షాపాతం, ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు 78.6 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో చిలుకవాగు పారడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. అయితే వర్షానికి లోతట్టు ప్రాంతాలైన హుజూరాబాద్‌లోని కిందివాడ, మామిండ్లవాడ, గ్యాస్ గోదాం ఏరియా, ఏక్ మినార్ ఏరియా, గాంధీనగర్, బుడ్గజంగాలకాలనీ, ఎస్ఐడబ్ల్యుకాలనీ, సిద్ధార్థనగర్, ఏకలవ్య కాలనీ, కొత్తపల్లి, ఇందిరానగర్ లోని సిక్కులవాడ, బోర్నపల్లిలోని తెనుగువాడ, దమ్మక్కపేట ఎస్సీకాలనీ, ఇప్పల్ నర్సింగాపూర్ ఎస్సీకాలనీ తదితర ప్రాంతాలలో వర్షం నీరు రోడ్లపై నిలవడంతో పాటు పలువురి ఇండ్లలోకి చేరాయి. మామిండ్లవాడ లో నలల బావి ధరలు మొత్తం కూలగా అధికారులు టిప్పర్లతో మెరం నింపారు. రోడ్లన్ని జలమయంగా మారగా స్థానిక కౌన్సిలర్ ఉజ్మానూరిన్ ఆమె భర్త మాజీ కో ఆప్షన్ సభ్యుడు బీఎస్ ఇమ్రాన్ పారిశుధ్య కార్మికులతో పలు చోట్టా గండిపెట్టించి నీరు పోలాల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం చెరువును తలపించేలా నీరు నిలవడంతో మార్నింగ్ వాకింగ్ దారులు నడకకు ఇబ్బంది బడ్డారు. అలాగే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలోకి వరదనీరు చేరింది. హుజూరాబాద్ బస్టాండ్ ఆవరణలో వర్షం నీరు ఎటు వెళ్లేదారిలేక అక్కడే నిల్వ ఉండడంతో చెరువును తలపించింది. వాహనదారులు, ప్రయాణీకులు, బాటసారులు లోతట్టు ప్రాంతాల్లో నిలచిన వర్షం నీరుతో కొంత అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలల్లో బల్దియా కమిషనర్ సల్వాది సమ్మయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు, జవాన్లు రాజు, రమేష్, అనిల్ ఆయ కౌన్సిలర్లు సందర్శించి శిథిలమైన ఇండ్లల్లో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి, సహాయ చర్యలు చేపట్టారు. ఇలాగే వర్షం మరో రెండు రోజులు కొట్టిందంటే పలువురి పురాతన ఇండ్లు శిథిలమై కూలిపోయే ప్రమాదం ఉందని పలువురు తెలిపారు. బుడగ జంగాల కాలనీ మొత్తం నీట మునగడంతో పూరి గుడిసెల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.











